Wednesday, August 20, 2014

వందమందికి కాదు....ఒక్కడికీ బదులియ్యి, చాలు...!!!

బాలా.......!      అబలా......!!      బాలభానూ.......!!!!
వందమందికి కాదు....ఒక్కడికీ బదులియ్యి, చాలు...!!!


ఆగస్టు ఒకటో తేదీన వసుంధరలో " వందమందికి బదులిచ్చా" శీర్షికను Http://Archives.Eenadu.Net/08-01-2014/Vasundara/Vasundarainner.Aspx?Item=Manulu లింకులో చదవవచ్చు ఇందులో ప్రస్తావించిన కొన్ని  విషయాలు సత్యదూరాలు కాగా, ఆమెలోని "బాల"త్వం ప్రపంచ ప్రఖ్యాతిపొందింది

అనంతరామయ్యగారికి అత్యంత సన్నిహితులమైన మాకు గర్తపురిలో (గుంటూరులో) ఆయనతో రెండు దశాబ్దాల వ్యక్తిగత పరిచయం ఉంది. మాకు తెలిసినంత వరకూ అనంతరామయ్యగారికి ఒకే ఒక్క మను మరాలు ఉన్నది. అది కూడా ఆయన కుమార్తెకు పుట్టింది.  ఆమె తల్లి తండ్రులు మహాపండితులు. వారు ఆంధ్రభాషలో చిన్నయసూరి తరువాత అంతటివారు అయినా, ఆయన మనుమరాలు మాత్రం ఒక సామాన్య గృహిణి మాత్రమే.  ఆకెళ్ల బాలభాను అనే ఆమె ఎవరో మాకు తెలియదు. స్వగతంలో ఆమె అనంతరామయ్యగారిని తన తాతగారు అని చెప్పుకొంది. ఆయన ఈమెకు ఏవిధంగా తాతగారు అవుతారో కొంచెం వివరిస్తే బాగుండేది. బహుశా అనంతరామయ్యగారు వాళ్ల తాతకు (అమ్మనాన్నకు లేదా నాన్న నాన్నకు) అన్నో, తమ్ముడో  అయితే, ఆమెకు అనంతరామయ్యగారు పెత్తాత లేదా చిన్నతాత అవుతారు కానీ తాతయ్యగారు కారుకదా? ఆమె తన తండ్రిగారి పేరు (ఇంటిపేరు సహితంగా), నిజమైన తాతగారిపేరు చెప్పుకుని ఉంటే బాగుండేది. 

 ఆయన కుమార్తెలకు, లేదా ఏకైక కుమారునికి చెందిన సంతానం బాలభాను కాదని మాకు కచ్చితంగా తెలుసు. 

ఇక, విషయానికి వస్తే, 

అవధాన నిర్వహణలో అనంతరామయ్యగారికి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికున్న ప్రజ్ఞ, నిశిత దృష్టి,  సమర్థతలు ఉన్నాయని సాహిత్యప్రియులకు తెలుసు. సాహిత్య రణరంగంలో ఆయన ఏ పక్షానికీ పక్షపాతం వహించక అవధాన భారతినే ఆరాధించిన తీరు నేటికీ అనేక మందికి ఇంకా గుర్తుంది.  కవనకదనరంగ నిర్వహణలో అవధానులకు సమానమైన ఖ్యాతి నార్జించిన అనంతరామయ్యగారు అవధానాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ఆయన ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురించారు. శతావధానాలు చేస్తున్న తొలి మహిళగా తనకు తానుగా చెప్పుకుంటున్న "బాల" భాను ముందుగా తన చిన తాతగారు లేదా పెత్తాతగారు అవధాన రంగానికి ఏర్పరచిన విధివిధానాలు, ఆయన గతంలోని సహస్రావధానులను శాసించిన తీరులు తెలుసుకుంటే మంచిది. ఆయన ఆవిధంగా ఫాలాక్షుడిలా రుద్రతాండవం చేయకుంటే  నేడు గల్లీ గల్లీలో పిల్లిపిల్లలు కూడా లాలూచీపడి మత్తేభాలు, శార్దూలాలుగా మారిపోయి ఉండేవని ఆమె తెలుసుకోవాలి. కేవలం ఆయన వల్లే ఆటవెలదులకు అవధాన రంగంలో చోటు లేకుండా పోయింది. కనుక, ముందుగా ఆమె తన చినతాతగారి బడిలో అవధాన ఓనమాలు నేర్చుకుంటే మంచిది. 

ఈమె  అవధానాలు చేసే విధానంలో కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవం. ఆయన పేరు ప్రస్తావిస్తున్న ఆమె, తన చినతాతగారు పత్రికా ముఖంగా ప్రస్తావించిన మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకుని, వాటిని ప్రధానమైన సవాళ్లు గా తీసుకోవాలని కోరుతున్నాము. ఆ మార్గదర్శకాలు పాటించకపోతే  రవీంద్రభారతిలో ఆమె అవధానం కేవలం "ప్రదర్శన" గా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చినతాతగారి ఆశీర్వచనాలు పొందడం, లోకం చేత చినతాత చూపిన మార్గంలో మెప్పుపొందడం ఆమెకు ప్రధానధ్యేయం గా ఉండాలి.

"బాలా!"  
అవధానంపై మీ చినతాతగారి కచ్చితమైన అభిప్రాయాలు, అవధానకదనరంగంలో ఆయన ఖడ్గప్రహరణాల గూర్చి ముందుగా తెలుసుకో!!! ఆ మార్గాలు అనుసరించు. లేకుంటే ఆకాశమేం విరిగి మీద పడదు. కానీ, "ఆయన మనుమరాలు అని చెప్పుకుంటున్న ఆమే, ఇంత అందంగా అవధానం చేస్తోంది " అని జనాలు దెప్పి పొడుస్తారు; చాటున. పొగడే వారు ఎదుట పొగిడినా, పంకజులు నిన్ను పావుగా చేసుకుని అవధాన సహస్ర, శతసహస్ర ఘనులు అయిపోతారు. మళ్లీ అవధానరంగానికి చెదపురుగులై పడతారు. ఆటవెలదులతో ఆటపాటలతో రమింపచేయాలని చూస్తారు. అలనాటి తిరుపతి వేంకట కవుల నుంచీ వస్తున్న వారసత్వ సంపదను నాశనం చేస్తారు. అంగుష్ఠమాత్రులు అగ్రభాగానికి వస్తారు. 
సా హిత్యరణ భూమిలో కత్తులకు పదును, ఆకలి ఎక్కువగా ఉంటుంది. కదనరంగంలో దిగిన తరువాత  పోనీలే పాపం "మొదటి ఆడది" అని ఉపేక్షించరు. ఝాన్సీ లక్ష్మిని కూడా నరికి చంపారని గుర్తుంచుకో. కాకపోతే ఇది సాహిత్య రంగం కనుక, ఇక్కడ కోతలు కంటికి కనిపించనంత లోతుగా ఉంటాయి. 

"అబలా"
నీ బలం నువ్వే కావాలి కానీ, నీ చినతాత బలం వాడుకోవాలని చూడకు. 

"బాలభానూ"
నీ పేరులో బాలభాను ఉందని తీవ్రమైన కాశ్మీర్ చలికాలంలో కాచిన లేత ఎండగా నిన్ను అందరూ చూడాలని కోరుకోకు. నువ్వు "అవధానానికి పట్టిన చీడపురుగుల్లో "  ఒకదానిగా చేరకుండా ఉంటే ఏలూరిపాటి అనంతరామయ్యగారికీ, నువ్వు ఏ వంశం నుంచీ (మీ నాన్నగారి ఇంటిపేరు) ఏ ఇంటికి  వెళ్లినా (అత్తారిల్లు- ఆకెళ్లవారు) ఏలూరిపాటి వంశానికీ వన్నె తెచ్చినదానివి అవుతావు.  లేదంటావా....,  లోకసహజంగా, లౌక్యంగా ఉండదలిస్తే, ఎటూ పెళ్లి అయిన "మనుమరాలు" (ఇంటి పేరు మారింది కనుక)  ఏలూరిపాటి వారిని తలచి చెట్టుపేరు చెప్పుకుని కాయలు "అమ్ముకో"వాలనుకోకు .  




No comments:

Post a Comment