Wednesday, August 20, 2014

వందమందికి కాదు....ఒక్కడికీ బదులియ్యి, చాలు...!!!

బాలా.......!      అబలా......!!      బాలభానూ.......!!!!
వందమందికి కాదు....ఒక్కడికీ బదులియ్యి, చాలు...!!!


ఆగస్టు ఒకటో తేదీన వసుంధరలో " వందమందికి బదులిచ్చా" శీర్షికను Http://Archives.Eenadu.Net/08-01-2014/Vasundara/Vasundarainner.Aspx?Item=Manulu లింకులో చదవవచ్చు ఇందులో ప్రస్తావించిన కొన్ని  విషయాలు సత్యదూరాలు కాగా, ఆమెలోని "బాల"త్వం ప్రపంచ ప్రఖ్యాతిపొందింది

అనంతరామయ్యగారికి అత్యంత సన్నిహితులమైన మాకు గర్తపురిలో (గుంటూరులో) ఆయనతో రెండు దశాబ్దాల వ్యక్తిగత పరిచయం ఉంది. మాకు తెలిసినంత వరకూ అనంతరామయ్యగారికి ఒకే ఒక్క మను మరాలు ఉన్నది. అది కూడా ఆయన కుమార్తెకు పుట్టింది.  ఆమె తల్లి తండ్రులు మహాపండితులు. వారు ఆంధ్రభాషలో చిన్నయసూరి తరువాత అంతటివారు అయినా, ఆయన మనుమరాలు మాత్రం ఒక సామాన్య గృహిణి మాత్రమే.  ఆకెళ్ల బాలభాను అనే ఆమె ఎవరో మాకు తెలియదు. స్వగతంలో ఆమె అనంతరామయ్యగారిని తన తాతగారు అని చెప్పుకొంది. ఆయన ఈమెకు ఏవిధంగా తాతగారు అవుతారో కొంచెం వివరిస్తే బాగుండేది. బహుశా అనంతరామయ్యగారు వాళ్ల తాతకు (అమ్మనాన్నకు లేదా నాన్న నాన్నకు) అన్నో, తమ్ముడో  అయితే, ఆమెకు అనంతరామయ్యగారు పెత్తాత లేదా చిన్నతాత అవుతారు కానీ తాతయ్యగారు కారుకదా? ఆమె తన తండ్రిగారి పేరు (ఇంటిపేరు సహితంగా), నిజమైన తాతగారిపేరు చెప్పుకుని ఉంటే బాగుండేది. 

 ఆయన కుమార్తెలకు, లేదా ఏకైక కుమారునికి చెందిన సంతానం బాలభాను కాదని మాకు కచ్చితంగా తెలుసు. 

ఇక, విషయానికి వస్తే, 

అవధాన నిర్వహణలో అనంతరామయ్యగారికి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికున్న ప్రజ్ఞ, నిశిత దృష్టి,  సమర్థతలు ఉన్నాయని సాహిత్యప్రియులకు తెలుసు. సాహిత్య రణరంగంలో ఆయన ఏ పక్షానికీ పక్షపాతం వహించక అవధాన భారతినే ఆరాధించిన తీరు నేటికీ అనేక మందికి ఇంకా గుర్తుంది.  కవనకదనరంగ నిర్వహణలో అవధానులకు సమానమైన ఖ్యాతి నార్జించిన అనంతరామయ్యగారు అవధానాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ఆయన ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురించారు. శతావధానాలు చేస్తున్న తొలి మహిళగా తనకు తానుగా చెప్పుకుంటున్న "బాల" భాను ముందుగా తన చిన తాతగారు లేదా పెత్తాతగారు అవధాన రంగానికి ఏర్పరచిన విధివిధానాలు, ఆయన గతంలోని సహస్రావధానులను శాసించిన తీరులు తెలుసుకుంటే మంచిది. ఆయన ఆవిధంగా ఫాలాక్షుడిలా రుద్రతాండవం చేయకుంటే  నేడు గల్లీ గల్లీలో పిల్లిపిల్లలు కూడా లాలూచీపడి మత్తేభాలు, శార్దూలాలుగా మారిపోయి ఉండేవని ఆమె తెలుసుకోవాలి. కేవలం ఆయన వల్లే ఆటవెలదులకు అవధాన రంగంలో చోటు లేకుండా పోయింది. కనుక, ముందుగా ఆమె తన చినతాతగారి బడిలో అవధాన ఓనమాలు నేర్చుకుంటే మంచిది. 

ఈమె  అవధానాలు చేసే విధానంలో కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవం. ఆయన పేరు ప్రస్తావిస్తున్న ఆమె, తన చినతాతగారు పత్రికా ముఖంగా ప్రస్తావించిన మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకుని, వాటిని ప్రధానమైన సవాళ్లు గా తీసుకోవాలని కోరుతున్నాము. ఆ మార్గదర్శకాలు పాటించకపోతే  రవీంద్రభారతిలో ఆమె అవధానం కేవలం "ప్రదర్శన" గా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చినతాతగారి ఆశీర్వచనాలు పొందడం, లోకం చేత చినతాత చూపిన మార్గంలో మెప్పుపొందడం ఆమెకు ప్రధానధ్యేయం గా ఉండాలి.

"బాలా!"  
అవధానంపై మీ చినతాతగారి కచ్చితమైన అభిప్రాయాలు, అవధానకదనరంగంలో ఆయన ఖడ్గప్రహరణాల గూర్చి ముందుగా తెలుసుకో!!! ఆ మార్గాలు అనుసరించు. లేకుంటే ఆకాశమేం విరిగి మీద పడదు. కానీ, "ఆయన మనుమరాలు అని చెప్పుకుంటున్న ఆమే, ఇంత అందంగా అవధానం చేస్తోంది " అని జనాలు దెప్పి పొడుస్తారు; చాటున. పొగడే వారు ఎదుట పొగిడినా, పంకజులు నిన్ను పావుగా చేసుకుని అవధాన సహస్ర, శతసహస్ర ఘనులు అయిపోతారు. మళ్లీ అవధానరంగానికి చెదపురుగులై పడతారు. ఆటవెలదులతో ఆటపాటలతో రమింపచేయాలని చూస్తారు. అలనాటి తిరుపతి వేంకట కవుల నుంచీ వస్తున్న వారసత్వ సంపదను నాశనం చేస్తారు. అంగుష్ఠమాత్రులు అగ్రభాగానికి వస్తారు. 
సా హిత్యరణ భూమిలో కత్తులకు పదును, ఆకలి ఎక్కువగా ఉంటుంది. కదనరంగంలో దిగిన తరువాత  పోనీలే పాపం "మొదటి ఆడది" అని ఉపేక్షించరు. ఝాన్సీ లక్ష్మిని కూడా నరికి చంపారని గుర్తుంచుకో. కాకపోతే ఇది సాహిత్య రంగం కనుక, ఇక్కడ కోతలు కంటికి కనిపించనంత లోతుగా ఉంటాయి. 

"అబలా"
నీ బలం నువ్వే కావాలి కానీ, నీ చినతాత బలం వాడుకోవాలని చూడకు. 

"బాలభానూ"
నీ పేరులో బాలభాను ఉందని తీవ్రమైన కాశ్మీర్ చలికాలంలో కాచిన లేత ఎండగా నిన్ను అందరూ చూడాలని కోరుకోకు. నువ్వు "అవధానానికి పట్టిన చీడపురుగుల్లో "  ఒకదానిగా చేరకుండా ఉంటే ఏలూరిపాటి అనంతరామయ్యగారికీ, నువ్వు ఏ వంశం నుంచీ (మీ నాన్నగారి ఇంటిపేరు) ఏ ఇంటికి  వెళ్లినా (అత్తారిల్లు- ఆకెళ్లవారు) ఏలూరిపాటి వంశానికీ వన్నె తెచ్చినదానివి అవుతావు.  లేదంటావా....,  లోకసహజంగా, లౌక్యంగా ఉండదలిస్తే, ఎటూ పెళ్లి అయిన "మనుమరాలు" (ఇంటి పేరు మారింది కనుక)  ఏలూరిపాటి వారిని తలచి చెట్టుపేరు చెప్పుకుని కాయలు "అమ్ముకో"వాలనుకోకు .  




Saturday, August 9, 2014

యేలూరిపాటి???

వందమందికి బదులిచ్చా!

 'అది చాలా కష్టమైన విద్య' అని కొందరంటారు. 'మగవాళ్లకే సొంతమైన ప్రక్రియ'గా మరికొందరు చెబుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా, క్లిష్టమైన అవధాన విద్యను శ్రద్ధతో సాధించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆకెళ్ల బాలభాను. 'అవధానంతో ఎన్నో విలువైన విషయాలు ఒంటబట్టాయి' అంటూ ఇలా చెబుతున్నారామె.


మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని తోగుమ్మి. ఇంట్లో అంతా ఉన్నత విద్యావంతులు, తెలుగు, సంస్కృత భాషలపై పట్టున్నవారు. అదే నన్నూ ఆ భాషలపై మక్కువ పెంచుకునేలా చేసింది. తాతయ్య ఏలూరిపాటి అనంతరామయ్యగారు దూరదర్శన్‌లో పద్యాల తోరణం చెప్పేవారు. ముప్ఫై ఏళ్లపాటు భద్రాద్రి రాముని కల్యాణానికి వ్యాఖ్యాతగానూ పనిచేశారు. దీనికితోడు అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచే సుమతీ, భాస్కర శతకాలను నేర్పించే వారు. సాహిత్యానికి సంబంధించిన కథలూ, విషయాలూ వివరించే వారు. దాంతో ఎనిమిదో తరగతికి వచ్చేప్పటికి చిన్న చిన్న కథలూ, పద్యాలూ రాయడం మొదలుపెట్టా. అవి స్కూలు పత్రికలో అచ్చయ్యేవి.

కార్గిలే స్ఫూర్తి...

బాగా చదువుకుని, ఏదయినా ఉద్యోగం చేయాలన్నదే మొదట్నుంచీ నా ఆలోచన. కానీ డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకోకుండా ఓ రోజు అవధానం చేయాలన్న ఆలోచన కలిగింది. అందుకు కార్గిల్‌ యుద్ధమే స్ఫూర్తి. అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ మా కాలేజీలో జరిగిన కవితల పోటీలో నేనూ పాల్గొన్నా

.''భార్గవులైరి నేడరుల పాలిట భారత కీర్తి పెంచగన్‌..
మార్గములెన్నియైన మన మానసమొక్కటియంచు నేడు మీ
వర్గములోని సైనికులు వందలు వేలును వీర దేహముల్‌
కార్గిల్‌లోన మీరిపుడు కానుకలిచ్చిరి దేశ మాతకున్‌!''

అంటూ 'ర్గ' ప్రాసతో కవిత చెప్పా. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఒకరు 'ఇది చాలా క్లిష్టమైన పద్యం. అవధానం చేసే వారిలా చెప్పావు. వీలైతే అవధానం మీద దృష్టిపెట్టమ్మా అని సలహా ఇచ్చారు. అది మొదలు నా దృష్టంతా దానిమీదే. ఎలాగైనా అవధానం నేర్చుకోవాలనుకున్నా. నా ఆలోచనను గమనించిన లెక్చరర్లూ నన్ను ప్రోత్సహించారు. అప్పట్నుంచి రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటూ వివిధ సాహిత్య గ్రంథాలనూ చదవడం మొదలుపెట్టా. కొన్ని నెలల పాటు రోజూ ఐదారు గంటలు దానికోసమే కేటాయించా. ఈ ప్రక్రియలో ప్రముఖ పండితులెందరో నన్ను ప్రోత్సహించారు. నేను చదివిన కాలేజీ ఆంధ్ర గీర్వాణి పీఠంలోనే మొదటిసారి అష్టావధానం చేశా. అది మొదలు దేశవ్యాప్తంగా పలుచోట్ల సుమారు నలభై వరకూ కార్యక్రమాలు చేశా. ఓసారి రవీంద్ర భారతిలో అవధానం చేశాక ప్రముఖ కవి రాళ్లబండి కవితాప్రసాద్‌ 'అవధానం చేసే అమ్మాయిలు తక్కువ. క్లిష్టమైన అంశాన్ని ఇష్టంగా ఎంచుకుని బాగా చేస్తున్నావ్‌. మంచి భవిష్యత్తు ఉంటుంది, దీన్ని వదిలిపెట్టకు' అన్నారు. ఆ మాటల స్ఫూర్తితో కొనసాగించా. సంస్కృతంలో భాషాప్రవీణ పట్టా తీసుకున్నా. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి ఎమ్మే తెలుగు, సంస్కృతాలను పూర్తి చేశా.

ఆడపిల్లల అత్యాచారాలపై...

పెళ్లయ్యాక అత్తిల్లు భట్నవిల్లికి మకాం మార్చా. సంస్కృత అధ్యాపకులైన మా వారి ప్రోత్సాహంతో శతావధానం చేయాలన్న కోరిక కలిగింది. అనుకోగానే జరిగేంత చిన్న విషయం కాదు కదా! భాషా ప్రతిభా, సమయస్ఫూర్తీ, సహనం అవసరం. వాటన్నింటిపై సాధికారత రావాలి. వందమంది పృచ్ఛకులు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమస్యా పూరణం చేయాలి. దీనికోసం చాలా సాధనే చేశా. గతేడాది కొవ్వూరులోని గాయత్రీ సేవా సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శతావధానం చేసి, మొదటి మహిళా శతావధానిగా గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సమయంలో పెద్దలడిగిన ప్రశ్నల్లో సంక్లిష్టంగా ఉన్నవి చాలానే ఉన్నాయి. వాటిని పరిష్కరించి అభినందనలు పొందడం మరిచిపోలేని అనుభూతి.ఒక పృచ్ఛకుడు 'కన్నతల్లికి ఎప్పుడు అన్నమిడకు' అంటూ సమస్య ఇచ్చారు. దాన్ని నేను

''అమృతవృష్టి కురియు అతిలోక సంపూజ్య
మాననీయ చరిత మాతృమూర్తి
మనసు కష్టపెట్టి మర్యాద కోల్పోయి
కన్నతల్లికి ఎప్పుడు అన్నమిడకు!'' 

అని పూర్తిచేశా. పూజనీయురాలైన కన్నతల్లిని ఆదరంగా చూసుకోవాలి. బాధపడేలా, మర్యాద తప్పి మాట్లాడుతూ అన్నం పెట్టినా పెట్టకపోయినా ఒకటే అన్న అర్థం వచ్చేలా చెప్పా. మరొకరు ఆడపిల్లల అత్యాచారాలను ప్రస్తావించారు. దానికి సమాధానంగా ఈ పద్యం చెప్పా.

అమ్మజాతినిటుల అవమానపరచగా
మనసులెట్టులొచ్చె మనిషి కాదా!
కరడుగట్టినట్టి కలుషవర్తనముల
కలుపువాడు తన పిశాచమగును!

లెక్చరర్‌గా పని చేస్తూనే..ఇవి మాత్రమే కాదు. ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో పద్యాలూ రాశా. వాటిల్లో వేంకటేశ్వర శతకం, రాజేశ్వరీ శతకం ఉన్నాయి. 'శతావధాన శతపత్ర సౌరభం' అనే పుస్తకాన్నీ రాశాను. ఇప్పుడు సుందర కాండను తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నా. ఈ అవధాన ప్రక్రియ వల్ల నాలోనూ బోలెడు మార్పులొచ్చాయి. జ్ఞాపకశక్తి పెరిగింది, సునిశిత దృష్టి, సమయపాలన, సమన్వయం, సహనం వంటి లక్షణాలు అలవడ్డాయి. ప్రస్తుతం ఓ కార్పొరేట్‌ కళాశాలలో సంస్కృతం లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నా. మొన్న మత్స సంతోషి కామన్వెల్త్‌లో పతకం గెలిచాక మా కళాశాలలో ఒకరు సైనా, సింధు, సంతోషి, సానియా పేర్లిచ్చి ఓ పద్యం చెప్పమన్నారు. దాన్ని ఇలా పూర్తిచేశా.

సైనా సింధు మరియు సంతోషి సానియా
తెలుగు తేజమిటుల వెలుగజేసె!
భరత జాతి కీర్తి వనితలకే స్ఫూర్తి
రంగమేదియైన రమణి గెలుచు!

సహకారం: ఎర్రంశెట్టి విజయ్‌, న్యూస్‌టుడే, అమలాపురం

ఈనాడు/ 2014- ఆగస్టు-01/ వసుంధర నుంచి సంగ్రహించినది